మహబూబ్నగర్ జడ్చర్ల: సంచార జాతి కులాల తరతరాల డిమాండ్ నెరవేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 51 కులాలను విముక్త, సంచార, అర్ధసంచార తెగలుగా అధికారికంగా గుర్తిస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నెం.10 ను 12 జూన్ 2026న జారీ చేసింది.గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ తిపిరిశెట్టి అధ్యక్షత వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “సంవత్సరాలుగా సంచార జాతి కులాలు సామాజికంగా అణిచివేతకు గురయ్యాయి. సరైన గుర్తింపు లేక, సంక్షేమ ఫలాలకు దూరంగా ఉంచబడ్డాయి. ఇప్పుడు వారి హక్కుల పోరాటానికి సామాజిక విజయం దక్కింది” అని అన్నారు.కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఎన్టీ డెవలప్‌మెంట్ బోర్డు సిఫారసు మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియను బీసీ కమిషన్‌కు అప్పగించింది. బీసీ కమిషన్ కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా 51 కులాలను గుర్తిస్తూ 30 జనవరి 2026న తుది నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్ 4 మే 2026న జరిగిన సమావేశంలో చర్చించి ఆమోదించింది. దీంతో నేడు అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ చారిత్రాత్మక జీవో సాధనలో కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం, కేంద్ర డీఎన్టీ బోర్డు ప్రతినిధులు, బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, కమిషన్ సభ్యులు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, సీఈఓ ఆలోక్ కుమార్‌లకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ జీవోతో లక్షలాది సంచార, అర్ధసంచార కుటుంబాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో తదుపరి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుంచారు:
1. రాష్ట్రంలో ప్రత్యేక డీఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి
2. 51 కులాలను ప్రత్యేక గ్రూప్‌గా చేర్చి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
3. ప్రస్తుత ఎంబీసీ కార్పొరేషన్‌ను డీఎన్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌గా పేరు మార్చాలి
దేశవ్యాప్తంగా ఉన్న సంచార జాతులను ఏకం చేసి, రాజ్యాంగబద్ధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, రాజ్యాంగ మూడో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్, అధ్యయన కమిటీ చైర్మన్ వై. వెంకటనారాయణ, వైస్ చైర్మన్ పల్లపు సమ్మయ్య, కోశాధికారి సిద్దుల రవీందర్, ఉపాధ్యక్షులు పన్నీరు నాగేశ్వరావు, యూత్ అధ్యక్షులు యువరాజ్, కర్నె శివకుమార్, గుండ్లపల్లి సత్యనారాయణ, మోహన్ చౌహాన్, మంకాళి భూపతి, సీంహాద్రి, కృష్ణ, మందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఫకీర్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్చర్ల ఫకీర్ జాంగిర్ పాషా కృతజ్ఞతలు తెలిపారు.
