జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో వరుస దొంగతనాలు ఇద్దరు నిందితుల అరెస్ట్, భారీగా సొత్తు రికవరీ జడ్చర్ల మరియు మహబూబ్‌నగర్ పట్టణ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల తనిఖీల్లో దొరికిన నిందితులు:
డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.జడ్చర్ల ఇన్ స్పెక్టర్ సిఐ కమలాకర్ నాగార్జున ఆదేశాలతో ఎస్.ఐ. కె. మల్లేష్ మరియు సిబ్బంది సోమవారం ఉదయం జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, వారు చేసిన వరుస దొంగతనాల నేరాలు బయటపడ్డాయి. నిందితుల అబ్దుల్ మతీన్ (25) సంవత్సరాలు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఇతను గతంలో ఐఐటి సంగారెడ్డిలో ట్రాన్స్‌పోర్ట్ సూపర్ వైజర్ గా పనిచేసేవాడు. ఇతనిపై గతంలోనే హత్యాయత్నం, పోక్సో కేసులు ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్లే ఏర్పడిన అప్పులను తీర్చడానికే దొంగతనాలు మొదలుపెట్టినట్లు విచారణలో తేలింది.దేవరశెట్టి శివకృష్ణ (26) సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన ఇతను వృత్తిరీత్యా డ్రైవర్. జల్సాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అబ్దుల్ మతీన్ తో జతకట్టాడువీరు పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహించేవారు. అర్ధరాత్రి సమయంలో ఇనుప రాడ్లతో తాళాలు విరగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాల్లోని నగదు, నగలను దోచుకుని పరారయ్యేవారు.నిందితుల నుంచి పెద్ద మొత్తంలో 5 తులాల బంగారం మరియు 15 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
