మహబూబ్నగర్ జిల్లా; జడ్చర్ల -జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి గ్రామంలో రైతులకు వ్యవసాయ ఇన్పుట్ల పంపిణీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రమేష్ నాయక్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నుంచి తమ సంస్థకు ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ అనే రెండు స్కీమ్స్ ఉన్నాయని, ఈ సంవత్సరం అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి, వికారాబాద్ జిల్లా అడవి వెంకటాపురం అనే రెండు గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి క్రాప్ సీజన్ లో నిర్వహిస్తున్న "ఖేత్ బచావ్ అభియాన్" లో భాగంగా రైతుల పొలాలను కెమికల్స్, మందుల నుంచి ఎలా కాపాడుకోవాలో, ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా ప్రమోట్ చేయాలో జూన్, జూలై నుంచి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
చిట్టబోయినపల్లి తాండాలో దాదాపు 90 కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నామని, వారికి నానో యూరియా, టార్పాలిన్ కవర్లు అందజేశామని, రానున్న రబీ సీజన్ లో బేస్ లైన్ సర్వే ప్రకారం హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు అందజేస్తామని తెలిపారు.నానో యూరియా వాడకంపై రైతులకు వివరిస్తూ... ఇఫ్కో తయారు చేసిన నానో యూరియా హాఫ్ లీటర్, వన్ లీటర్ డబ్బాలో వస్తుందని, లీటర్ నీటికి 1 నుంచి 2 ఎం.ఎల్. కలిపి విత్తిన 15-20 రోజుల తర్వాత ఒకసారి, పూత దశలో మరోసారి స్ప్రే చేయాలని సూచించారు. దీనివల్ల మొక్కకు కావాల్సిన నత్రజని అందుతుందని, ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు.రైతులు ఎక్కువ మందులు, ఎరువులు వాడడం వల్ల నేల సారవంతం నాశనం అవుతుందని, అందుకే సమతుల్య ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ గ్రామాన్ని రోల్ మోడల్ గా చేసి కూరగాయలు, మొక్కజొన్న, వరి అంతా ఆర్గానిక్ గా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని, రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలు మరో రెండేళ్లు కొనసాగిస్తామన్నారు.ఎల్ నినో పరిస్థితుల్లో నానో యూరియా ఎంతో ఉపయోగపడుతుందని, 20-25 రోజులు వర్షం రాక చిన్న వర్షం వచ్చినప్పుడు స్ప్రే చేస్తే మొక్క త్వరగా రికవరీ అవుతుందన్నారు.
పంట వేసే ముందు భూసార పరీక్ష తప్పనిసరి అని, కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన ఇన్స్టెంట్ సాయిల్ కిట్ ద్వారా 5-10 నిమిషాల్లోనే నేలలో నత్రజని, భాస్వరం, పొటాషియం స్థాయి తెలుస్తుందని వివరించారు.అనవసరంగా షాపుల్లో యూరియా కొనవద్దని, అవసరం ఉందో లేదో తెలుసుకునే వాడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
