జడ్చర్ల ఆగస్టు 22 ;ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిరవధిక బంద్ - ఆగస్టు 24 న రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ లో బంద్ ప్రకటించారు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్, స్కూల్ డ్రైవర్లు నిరవధిక బంద్ కు జడ్చర్ల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ షేక్ హాజీ పిలుపునిచ్చారు. డ్రైవర్ సంఘాల జేఏసీ ఈ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది.ఆర్టీసీ తర్వాత ప్రజలకు అత్యధిక రవాణా సౌకర్యం కల్పిస్తున్నది ఆటో రంగమేనని, లక్షలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి ఆటోలు కొని జీవనం సాగిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చి హామీ తప్పిందని విమర్శించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని గుర్తు చేశారు.మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిందని, ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్ లు ఇష్టారాజ్యంగా కమీషన్లు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వమే ప్రత్యామ్నాయ యాప్ తీసుకురావాలని, అక్రమ టూవీలర్ సర్వీసులను నిషేధించాలని కోరారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెరిగిన ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీల పెంపు, ఏటా రూ.12 వేల సాయం, ఈ-చలాన్ల నుండి మినహాయింపు, జీవో 263, జీవో 60 సవరణ, వాహన సారథి పోర్టల్ లో లైసెన్స్ కొనసాగింపు, గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ బోర్డులో ప్రాతినిధ్యం, యాక్సిడెంట్ బీమాను సాధారణ మరణాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
