జడ్చర్ల, ఆగస్టు 21: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం వరకు మండల సాధారణ సర్వసభ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ పొడవునా గ్రామాల సమస్యలపై చర్చ జరగగా, అధికారుల తీరుపై సర్పంచులు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు.తాము పదవుల్లోకి వచ్చి నెలలు గడుస్తున్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచులు ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల అలసత్వం వల్ల తాము ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోందని మండిపడ్డారు. గ్రామాల్లోని సమస్యలను వివరించడానికి అధికారులకు ఫోన్ చేస్తే.. కనీసం ఫోన్లు ఎత్తడం లేదని, కొందరైతే తమ నెంబర్లను ఏకంగా బ్లాక్ లిస్టులో పెడుతున్నారంటూ సర్పంచులు సభ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ప్రతిపక్ష సర్పంచులే కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు సైతం అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ స్వంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు బహిరంగంగానే సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వీడి, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా నడుచుకోవాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
