మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోజువారీ అలవాటులో భాగంగా ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ గ్రామానికి చెందిన కటికే జంగోజి (70) అనే వృద్ధుడు సోమవారం ఉదయం వాకింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరారు. రోడ్డుపై నడుస్తుండగా ఒక్కసారిగా ఆయన స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతి చెందారు.
వృద్ధాప్య సమస్యలు లేదా గుండెపోటు కారణంగానే జంగోజి మరణించి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
