జడ్చర్లలో రైతుల రాస్తారోకో: జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు జడ్చర్ల, ఏప్రిల్ 28: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న సేకరణలో జరుగుతున్న ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలోని కాటన్ మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారి 167పై రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.తమ పంటను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సైలు మల్లేశ్, జయ ప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.రైతులతో మాట్లాడి, సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
