జడ్చర్ల, జూన్ 03 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీన జడ్చర్ల పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.బుధవారం జడ్చర్ల పరిధిలోని గంగాపూర్ రోడ్డులో సిద్ధం చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక నిర్మాణం, ప్రజల కొరకు గ్యాలరీలు, తాగునీటి సరఫరా, విద్యుత్ లైట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై అధికారులతో కలిసి వారు సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆదేశించారు.స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల రాక నియోజకవర్గ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సభ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ జానకి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
