ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజల విశ్వాసంతో ప్రచారంలో దూసుకెళ్తున్న రామస్వామి ఇంటింటి ప్రచారంలో అనుపటి రామస్వామి మహబూబ్‌నగర్ పట్టణంలోని 6వ డివిజన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్న అనుపటి రామస్వామి రాజకీయ ప్రయాణం జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి నాయకత్వంపై విశ్వాసం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఇవన్నీ ఆయనను బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. గత కాలంలో 6వ డివిజన్‌లో జరిగిన పలు అభివృద్ధి పనులు ఆయన రాజకీయ ఆశయాలకు బలమైన ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యే సహకారం, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ల ఆధ్వర్యంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, ఎస్సీ కాలనీలో మూడు బోర్లు ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాల పనులు జరిగాయి. చైతన్య నగర్, వినాయక నగర్, అక్షర కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణం జరగడం ద్వారా ప్రజల దైనందిన జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అదేవిధంగా ఎస్సీ స్మశాన వాటికలో స్వయంగా తన వంతు కృషిగా మంచినీటి బోరు ఏర్పాటు చేయడం ఆయన సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తూ అర్హులైన పేదలకు ఇళ్లు సాంక్షన్ చేయించడంలో కీలక పాత్ర పోషించిన అనుపటి రామస్వామి, ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎన్నంకు మంచి పేరు తీసుకొచ్చారు. కాగితాలకే పరిమితమయ్యే రాజకీయానికి భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు చూపిన తీరు ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ డివిజన్‌ను ఎస్సీ జనరల్‌గా నిర్ణయించడం ఆయనకు మరింత బలం చేకూర్చే అంశంగా మారింది. పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే ఆశీస్సులు, ప్రజల విశ్వాసం తనకు అండగా ఉన్నాయనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అనే కాంగ్రెస్ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో అమలు చేసిన అనుభవంతో తనకు అవకాశం ఇస్తే 6వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని అనుపటి రామస్వామి ప్రజలను కోరుతున్నారు. ప్రజల మద్దతే తన నిజమైన బలం అనే విశ్వాసంతో ముందుకు సాగుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం, స్థానిక రాజకీయాల్లో సానుకూల చర్చకు దారితీస్తోంది.
