మహబూబ్నగర్ ; ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిబంధనలను విధించింది. లబ్ధిదారులు తమ అవసరానికి మించి స్లాబ్‌ను (RCC Roof) 3 నుండి 8 అడుగుల వరకు పొడిగించడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల చాలామంది అప్పులపాలు కావడం, మరికొందరి ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతోనే ఇల్లు పూర్తయ్యేలా చూడడమే ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశ్యం.
ప్రభుత్వ తాజా నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:
1. స్లాబ్ పొడిగింపు పరిమితులు:
- ఇంటి ముందు వైపు గరిష్టంగా 3 అడుగులు మాత్రమే స్లాబ్ పొడిగించాలి.
- మిగిలిన మూడు వైపులా గరిష్టంగా 1 అడుగు మాత్రమే అనుమతి ఉంటుంది.
- ప్లింత్ ఏరియా 600 చ.అ. ఉంటే, స్లాబ్ ఏరియా 750 చ.అ. మించకూడదు.
- ప్లింత్ ఏరియా 400 చ.అ. ఉంటే, స్లాబ్ ఏరియా 500 చ.అ. మించకూడదు.
2. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:
- డోర్లు, కిటికీల రక్షణ కోసం స్లాబ్‌ను పొడిగించకుండా, సన్‌షేడ్లు (Chajjas) ఏర్పాటు చేసుకోవాలి.
- ముందు భాగంలో నీడ కోసం RCC స్లాబ్‌కు బదులుగా GI షీట్‌తో షెడ్ నిర్మించుకోవాలి.
3. వీరికి వర్తిస్తుంది:
- ప్రస్తుతం RL, BL, Grounding మరియు Not Grounded దశల్లో ఉన్న లబ్ధిదారులందరికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
ఇకపై ఇందిరమ్మ ఇళ్లలో నిర్ణయించిన పరిమితికి మించి స్లాబ్‌ను నిర్మించకూడదని ఎంపీడీఓ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులందరికీ ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించాలని గౌరవ సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు అధికారులు స్పష్టం చేశారు.
