జడ్చర్ల, మే 21 జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల జాతీయ బీసీ సేన సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జడ్చర్ల అసెంబ్లీ జాతీయ బీసీ సేన సంఘం అధ్యక్షుడు ఎల్పటి వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు కులగణనను వ్యతిరేకించే వారికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కాలని బీసీ సమాజాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయని, ఆ పోరాట ఫలితమే ఈనాటి సుప్రీంకోర్టు తీర్పు అని కొనియాడారు. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను తొలగించడానికి, వెనుకబడిన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగడానికి సమగ్ర కులగణన ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు సరైన సంక్షేమ విధానాలను రూపొందించాలన్నా కులాల వారీగా లెక్కలు తేలడం అత్యంత అవసరమని కోర్టు గుర్తించడం అభినందనీయమన్నారు. గతంలో కులగణన చేస్తామని హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేయాలని చూసిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకుని, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొదటి దఫా కుటుంబాల లెక్కింపులోనే ఓబీసీ/బీసీ కుటుంబాల వివరాలను సేకరించాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా లెక్కల అవసరాన్ని గుర్తించి, సమర్థించినందుకు గాను సుప్రీంకోర్టుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
