మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని అల్వాన్ గ్రామంలో మంగళవారం పట్టపగలు సాయంత్రం వేళలో దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని, ఆమెపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు.బంగారు గొలుసుతో దొంగలు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై 167వ జాతీయ రహదారి గుండా కల్వకుర్తి వైపు వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడే ఉన్న స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వెంటనే దొంగలను వెంబడించి, కొద్ది దూరంలోనే వారిని సినిమా స్టైల్‌లో చుట్టుముట్టి పట్టుకున్నారు.గ్రామస్తులు వెంటనే ఈ ఘటనపై జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల ఎస్ఐ మల్లేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సంరక్షణలో ఉన్న దొంగలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
జడ్చర్లలో ఘోరం: మహిళపై దాడి చేసి గొలుసు దొంగతనం.. వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు
June 09, 2026
Tags
