జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. బతికున్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా మృతదేహాలకు కనీస గౌరవం దక్కని దుస్థితి ఇక్కడ నెలకొంది. జడ్చర్ల పాత బజార్‌కు చెందిన రాములు అనే వ్యక్తి మృతదేహంతో పాటు, మరో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఈ ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. అయితే, సకాలంలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేయకపోగా.. మృతదేహాలను భద్రపరిచిన ఫ్రీజర్ పనితీరును సిబ్బంది పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఫ్రీజర్ MCB ట్రిప్ అయిన విషయాన్ని కూడా గమనించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే.. మృతదేహాలు కుళ్ళిపోయి, గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయాయని స్థానికులు మండిపడుతున్నారు. అసలు ఫ్రీజర్ కండిషన్లో ఉందా? లేదా? విద్యుత్ సరఫరాలో లోపాలున్నాయా? లేక సిబ్బంది చేతులారా విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శించారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ ఇదే జడ్చర్ల పాత ఆసుపత్రి మార్చురీలో.. ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న అమానవీయ ఘటన జరిగి తీవ్ర వివాదాస్పదమైంది. ఆ చేదు అనుభవాలు ఎదురైనా అధికారులు, సిబ్బంది తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన తమ వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కును కూడా కాలరాస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగుతున్నారు.వంద పడకల అత్యాధునిక ఆసుపత్రి అని బోర్డులు మార్చారు కానీ.. మార్చురీ నిర్వహణ, మృతదేహాల భద్రతను మాత్రం అధ్వాన్నంగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఈ ఘోర కలకలంపై సమగ్ర విచారణ జరపాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
