కల్వకుర్తి నివాసి అయిన సాయి రెడ్డి, తాము బ్యాంకు సర్ఫేసీ చట్టం కింద నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొని, అత్యధిక బిడ్డర్‌గా నిలిచి చట్టబద్ధంగా ఆస్తిని దక్కించుకున్నామని తెలిపారు. వేలం అనంతరం బ్యాంకు అధికారులే తమకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆస్తిని అప్పగించారని స్పష్టం చేశారు.ఈ ఆస్తికి సంబంధించి పాత యజమానులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ , డిఆర్‌ఎటి హైకోర్టు మరియు సుప్రీంకోర్టులలో దాఖలు చేసిన పిటిషన్లు మరియు దాదాపు 41 అదనపు కేసులు కొట్టివేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, పిటిషనర్లపై హైకోర్టు రూ. 20,000 జరిమానా కూడా విధించిందని తెలిపారు.మొత్తం 55 ఎకరాల 4 గుంటల స్థలానికి సంబంధించి కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక చర్చికి తమ ఆధీనంలో ఉన్న స్థలం నుండి 15 గుంటలను కేటాయించామని, క్రిస్టియన్ సోదరులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చట్టబద్ధమైన పత్రాలు, హైకోర్టు ఆదేశాలు మరియు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ ప్రక్రియ ద్వారానే తమకు ఈ స్థలంపై పూర్తి హక్కులు లభించాయని సాయి రెడ్డి స్పష్టం చేశారు.
