తెలంగాణ గడ్డపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ సందర్శనపై ఆంక్షలు విధించడం పట్ల జడ్చర్ల మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ డాక్టర్ కోడుగల్ యాదయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునేందుకు, విగ్రహం వద్ద ఉన్న గేట్ల తాళాలను వెంటనే తొలగించి ప్రజల సందర్శనకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రూ . 146 కోట్ల వ్యయంతో, 11.40 ఎకరాల విస్తీర్ణంలో, 465 టన్నుల బరువుతో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని నిర్మించారని గుర్తు చేశారు. 2023 ఏప్రిల్ 14న ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరింపబడిందని తెలిపారు.ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ప్రజలు చూడకుండా గేట్లకు తాళాలు వేయడం అన్యాయమని, విగ్రహం చూడాలన్నా సీఎం రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అట్లూరి లక్ష్మణ్ వివేక్ వంటి వారు పదవులు అనుభవిస్తూ అంబేద్కర్ విగ్రహానికి జరుగుతున్న అవమానంపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఎస్సీ రిజర్వేషన్లపై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, తక్షణమే అంబేద్కర్ విగ్రహ గేట్లు తెరిపించాలని డాక్టర్ యాదయ్య డిమాండ్ చేశారు.
