మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధనకై 'విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ' (JAC) చేపట్టిన సమ్మె నేటికి 6 వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీ నుండి ఆర్టిజన్లు శాంతియుత నిరసనలు తెలుపుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాకముందు ఆర్టిజన్ల సమస్యలపై గళమెత్తిన నాయకులు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం పాటించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి, తమ పొట్ట కొడుతున్నారని వారు ధ్వజమెత్తారు. విద్యార్హతల ఆధారంగా అర్హులైన ఆర్టిజన్ ఉద్యోగులందరికీ కన్వర్షన్ ప్రక్రియను చేపట్టాలి.ఆర్టిజన్లకు ప్రస్తుతం ఉన్న O&M (పాత APSEB) సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలి అని అన్నారు TGNPDCL మరియు TGSPDCLలలో పని చేస్తున్న అన్-మాన్డ్ వర్కర్లను (Un-manned workers) వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి విలీనం చేసుకోవాలి.2016 డిసెంబర్ 4 కంటే ముందు నుండి అన్ని అర్హతలు ఉండి, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా పరిగణించాలి. పీస్ రేట్ (Piece Rate) కార్మికులకు G.O.No. 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి.రాబోయే 2026 వేతన సవరణ (PRC)ను సకాలంలో అమలు చేయాలి.తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు.
