ఇప్పపువ్వు మద్యం తో రాష్ట్రానికి ఆదాయం

ఇప్పపువ్వు మద్యం తో రాష్ట్రానికి ఆదాయం

TBN LIVE
ఇప్పపువ్వు టకీలా పదేళ్ల లోనే మెక్సికో టకీలాను అధిగమిస్తుంది
• ప్రభుత్వానికీ, ఆదివాసీలకు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది*
• ఇప్పపువ్వు మద్యానికి 5 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది
• బ్రిటీష్ పాలకులు ఇప్పపువ్వు మద్యాన్ని నిషేధించడం వెనక కుట్ర ఉంది
• విదేశాల్లో ఇప్పపువ్వు ను దిగుమతి చేసుకొని మద్యం తయారు చేస్తున్నారు
• మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో ఇప్పపువ్వు మద్యానికి అనుమతులు ఇచ్చారు
• ప్రధాని మోదీ మన్ కీ బాత్ లోనూ ఇప్పపువ్వు లడ్డూలను ప్రశంసించారు
• ఇప్ప టకీలా తయారీ కోసం ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి
• ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
• అసెంబ్లీలో ఇప్పపువ్వు మద్యంపై గళమెత్తిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, మార్చి 25: బ్రిటీష్ పాలకులు తమ ప్రభుత్వ ఆదాయం తగగ్గిపోతుందని కుట్ర పూరితంగా నిషేధం విధించిన ఇప్పపువ్వు తో ఇప్పసురా, ఇప్ప టకీలాను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయగలిగితే పదేళ్ల కాలంలోనే ప్రభుత్వానికీ, ఆదివాసీ గిరిజనులకు లక్షల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 5 వేల ఏళ్ల చరిత్ర, ఎన్నో మహత్తరమైన ఔషధ విలువలు కలిగిన ఇప్ప పువ్వు ను పూర్తిగా వినియోగించుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల్లో అనిరుధ్ రెడ్డి ఇప్పపువ్వు తో మద్యాన్ని తయారు చేయాల్సిన ఆవశ్యకతను లేవనెత్తారు. రాష్ట్రంలో 1994 లో సారా నిషేధం విధించక ముందు సారా వల్ల ఆదాయం రూ.370 కోట్లు ఉంటే ఇతర విదేశీ మద్యం వల్ల ఆదాయం కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఉండేదని చెప్పారు. అయితే సారా నిషేధం విధించిన తర్వాత విదేశీ మద్యం ఆదాయం ఒక్కసారిగా రూ.700 కోట్లకు పెరిగిందని తెలిపారు. తాను నల్ల బెల్లం, హాని కారకమైన రసాయనాలతో తయారు చేసే నాటు సారాను గురించి మాట్లాడటం లేదని, తాను దానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. తాను మాట్లాడుతున్నది కేవలం మన దేశంలో 5 వేల ఏళ్ల చరిత్ర కలిగిన సాంప్రదాయక ఇప్పపువ్వు మద్యం గురించి మాత్రమేనని స్పష్టం చేసారు. మెక్సికో, జపాన్, చైనా, స్కాట్లాండ్ తదితర దేశాలు తమ సాంప్రదాయక మద్యాలను ప్రపంచ దేశాల్లో విక్రయించి భారీగా ఆదాయాన్ని పొందుతున్నాయని చెప్పారు. ఒక మొక్కతో మెక్సికో తయారు చేసే టకీలా అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.2.35 లక్షల కోట్లు ఆర్జిస్తుంటే, చైనా జొన్నలు, గోధుమలతో తయారు చేస్తున్న మహుటాయ్ అనే సాంప్రదాయక మద్యాన్ని అమ్మడం ద్వారా రూ.2.26 కోట్లు గడిస్తోందని వెల్లడించారు. బియ్యపు గింజలతో జపాన్ తయారు చేస్తున్న సాకి అనే మద్యం, స్కాట్లాండ్ తయారు చేస్తున్న స్కాచ్ ద్వారా కూడా వేల కోట్ల రుపాయలను సంపాదిస్తున్నాయని వివరించారు.  ఆ దేశాలు తయారు చేస్తున్న సాంప్రదాయక మద్యాల తరహాలోనే మన దేశానికి ఉన్న సాంప్రదాయక మద్యం ఇప్పపువ్వు తో చేసే మద్యమేనని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఇప్పసారా అంటే దాన్ని చాలా తక్కువ చేసి చూస్తారని, అందుకే తాను ఇప్పపువ్వు తో తయారు చేసే మద్యాన్ని ఇప్ప సురా, ఇప్ప టకీలా అంటానని పేర్కొన్నారు. ఇప్పపువ్వు ను కేవలం మద్యం తయారీకి ఉపయోగించే పువ్వుగానే చూడకూడదని దీనిలో యాంటీ డయాబెటిక్, యాంటీ కేన్సర్, యాంటీ అల్సర్ లాంటి అపూర్వమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఇప్పపువ్వు తో కేవలం మద్యాన్ని మాత్రమే కాకుండా ఇప్ప కోలా అనే పేరుతో ఎనర్జీ డ్రింకు కూడా చేయవచ్చునని, తియ్యగా ఉండే ఇప్పపువ్వు లతో లడ్డూలు కూడా చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో కూడా ఇప్పపువ్వు లడ్డూలను ప్రస్తావించి వాటిని ఎంతగానో ప్రశంసించి ప్రమోట్ చేసారని గుర్తు చేసారు. ఇప్పపువ్వుతో ఇప్ప టకీలా, ఇప్ప కోలా లాంటి ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీషులో మహువా గా వ్యవహరించే ఇప్పపువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అమెరికాలో చేసిన పరిశోధనల్లో కూడా తేలిందన్నారు. ప్రస్తుతం మన దేశంలో మధ్యప్రదేశ్, గోవా, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అనుమతులు ఇచ్చి, ఇప్పపువ్వు లతో సాంప్రదాయకమైన సొంత బ్రాండ్లను తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదివాసీ గిరిజనులకు ఎంతగానో మేలు చేస్తున్నాయని చెప్పారు. ఇప్ప పువ్వు మద్యం తయారీ ద్వారా ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఆదివాసీ కుటుంబాలకు ఉఫాధి లభిస్తోందని తెలిపారు. ఇప్పపువ్వు మద్యం తయారీపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఎక్సైజ్ పాలసీల పత్రాలను, ఇప్పపువ్వు తో తయారు చేస్తున్న మద్యం బ్రాండ్ల ఫోటోలను అసెంబ్లీలో సభ్యులకు అనిరుధ్ రెడ్డి చూపించారు. మన దేశంలోనే కాకుండా ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాల్లో కూడా ఇప్పపువ్వు ను భారత దేశం నుంచి దిగుమతి చేసుకొని వాటితో మహువా మద్యం బ్రాండ్లను తయారు చేసి 750 ఎం.ఎల్. మద్యాన్ని రూ.5 వేల వరకూ విక్రయిస్తున్నారని కూడా చెబుతూ వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సభలో చూపించారు. ఇప్పపువ్వు తో మద్యాన్ని తయారు చేయడం వేదాలు, పురాణాల కాలం నుంచే ఉందని, ఆయుర్వేదానికి మూలమైన చరక సంహిత, సుశృత సంహితలో కూడా దీని ప్రస్తావన ఉందని వెల్లడించారు. క్రీ.శ.1800 వరకూ కూడా ఇప్పపువ్వు తో మద్యాన్ని తయారు చేసి సేవించడానికీ, విక్రయించడానికీ అందరికీ స్వేచ్ఛ ఉండగా దీని కారణంగా తాము అమ్ముతున్న విదేశీ మద్యం ఆదాయానికి గండి పడుతోందని అప్పటి బ్రిటీష్ వలస పాలకులు 1892 లో మోవ్రా యాక్ట్ ను తీసుకొచ్చి ఇప్పపువ్వు మద్యాన్ని కుట్ర పూరితంగా నిషేధించిందని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. బ్రిటీష్ వారు తమ స్వలాభం కోసం అప్పుడు పెట్టిన నిషేధం ఇప్పటి వరకూ చెలామణిలో ఉండటం దురదృష్టకరమన్నారు. ఇప్పపువ్వు విశిష్టతలను, అందులో ఉండే ఔషధ గుణాలను పరిగణలోకి తీసుకొని ఇప్పపువ్వు తో ఇప్ప టకీలా ను తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి అందులో ఆదివాసీలను కూడా భాగస్వాములను చేసి ఇప్ప టకీలాను అంతర్జాతీయంగా ఎగుమతులు చేసి విక్రయించగలిగితే కేవలం 10 సంవత్సరాల కాలంలోనే ఇప్ప టకీలా మెక్సికో తయారు చేస్తున్న టకీలాను అధిగమిస్తుందనే నమ్మకం తనకు ఉందని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. దీని ద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ గిరిజనులకు కూడా లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల ఇప్ప చెట్లు ఉన్నాయని, వీటిలో ఒక చెట్టు ద్వారా ఏడాదికి 200 కిలోల ఇప్పపువ్వు వస్తాయని చెప్పారు. ఒక ఎకరాలో 50 నుంచి 60 ఇప్ప చెట్లను పెంచే అవకావం ఉందని, దీని ద్వారా ఎకరానికి  ఏడాదికి రూ.3 లక్షల వరకూ ఆదాయం సమకూరుతుందని వివరించారు. నాటిన తర్వాత ఎనిమిదేళ్లకు పూతకు వచ్చే ఇప్ప చెట్లు ఎలాంటి ఎరువులు, క్రిమి సంహారక మందులు అవసరం లేకుండానే వందేళ్లు జీవిస్తాయని తెలిపారు. ఈ లెక్కన ప్రాజెక్టుల కింద వరి పండించడం ద్వారా సాధించే దాయం కంటే ఇప్ప చెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని అనిరుధ్ రెడ్డి చెప్పారు.ఈ నేపథ్యంలోనే ఇప్ప చెట్లను పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!