• ఆ ఆధారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి
• కొండకల్, మోకిలా లో 1100 ఎకరాల గిరిజనుల భూములనూ కొట్టేశారు
• ఈ విషయాలపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాను
• భూములు కొట్టేసిన వాళ్లు త్వరలోనే జైలుకు వెళ్తారు
• ఇసుక అక్రమ రవాణాపై ఎవరు ఎన్ని కేసులు పెట్టారో ఆధారాలు ప్రజల ముందు పెడతా
• ఆధారాలు ఉంటేనే నేను ఏదైనా మాట్లాడుతా
• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి.
జడ్చర్ల, ఫిబ్రవరి 23: భూ కబ్జాలకు ఎవరు పాల్పడ్డారో, ఎవరి హయాంలో ఇసుక అక్రమ రవాణాను అణిచి వేయడానికి ఎక్కువగా కేసులు పెట్టడం జరిగిందో త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూమిని కొట్టేసారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయని వెల్లడించారు. కొండకల్, మోకిలా ప్రాంతాల్లో 1100 ఎకరాల గిరిజన భూములను కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని తెలిపారు.
బాలానగర్ మండలంలోని పెద్దాయిపల్లి గ్రామంలో రూ.50 లక్షల ముడా నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సోమవారం అనిరుధ్ రెడ్డి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, తన హయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో విచ్ఛలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరిగినప్పుడు ఎన్నికేసులు పెట్టారో, తాను ఎమ్మెల్యే అయ్యాక ఇసుక రవాణాపై ఎన్ని కేసులు పెట్టారో ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులు కుంటలలో లేఅవుట్లకు అనుమతులు ఇచ్చారని, అలాంటి అక్రమ లేఅవుట్లు అన్నింటినీ తాను రద్దు చేయిస్తానని హెచ్చరించారు. ఆధారాలు ఉంటేనే తాను ఏదైనా మాట్లాడుతానని అన్నారు. ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీలు వేయకుండానే పర్మిషన్లు ఇచ్చారో, నిబంధనల ప్రకారంగా మౌలిక వసతులు కల్పించకుండానే లే అవుట్ మార్టిగేజ్ లను ఎలా క్లియర్ చేసారో మీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డిని వచ్చి మాట్లాడమని చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూములను కొట్టేశారని, వాటికి సంబంధించిన రికార్డెడ్ డాక్యుమెంట్లు లేకపోయినా వాటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడతాయని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. దీంతో పాటుగా రంగారెడ్డి జిల్లా కొండకల్, మోకిల్లా లో 1100 ఎకరాల భూమిని బీఆర్ఎస్ నేత కబ్జా చేసిన విషయం గురించి కూడా తాను అసెంబ్లీలో మాట్లాడానని గుర్తు చేసారు. ఇది జడ్చర్లకు సంబంధించని విషయమైనా గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ తాను ఒక ఎమ్మెల్యేగా ఈ విషయం గురించి ప్రస్తావించానని స్పష్టం చేసారు. ఈ విషయం గురించి తాను సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడానని, ఈ వ్యవహారాల్లో ఎవరైతే జైలుకు వెళ్లాలో వారు త్వరలోనే జైలుకు వెళ్తారని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్దాయపల్లి ప్రాంతంలో ముడా లేఅవుట్లు ఉన్నా ముడాకు చెందిన నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయించలేదని విమర్శించారు. జడ్చర్ల నియోజకవర్గానికి రావాల్సిన రూ.30 కోట్ల ముడా నిధులను మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ కు మళ్లించారని పునద్ఘాటించారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఇద్దరు ముడా డైరెక్టర్లుగా కొనసాగినా వారిని ముడా సమావేశాల్లోనూ రానివ్వలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జడ్చర్ల నియోజకవర్గానికి రూ.10 కోట్ల ముడా నిధులను తీసుకొచ్చానని, మరో రూ.6 కోట్ల వరకూ నిధులు గత సమావేశంలో మంజూరు కావడం జరిగిందని వివరించారు. పెద్దాయపల్లికి ముడా నిధుల నుంచి సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం రూ.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఇది కాకుండా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్, రూ.50 కోట్లతో నవోదయ స్కూల్ కూడా పెద్దాయపల్లిలోనే మంజూరు అయ్యాయని గుర్తు చేసారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పని చేస్తానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.
