స్టార్లైనా ఉపేక్షించేది లేదని, ప్రైజ్ చిట్స్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుని, లక్కీ డ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన స్పందించారు. గతంలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు లక్కీ డ్రాల అవతారమెత్తారని సీపీ ధ్వజమెత్తారు. కార్లు, ఖరీదైన బైకులు, ఇళ్లు, డీజే సెట్లు బహుమతులుగా ఇస్తామంటూ ప్రజలకు ఎర వేసి, నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రీల్స్లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ, వాస్తవంలో మోసాలకు పాల్పడుతున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలను సజ్జనర్ ఎక్స్లో షేర్ చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో వారు సినిమా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. చట్టపరమైన చర్యల నుంచి ఎవరూ తప్పించు కోలేరని తేల్చి చెప్పారు. లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్ప డుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను సీపీ కోరారు. ఇందుకోసం డయల్ 100కు గానీ, హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కు గానీ వివరాలు పంపించాలని సూచించారు. లేదా స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రలోభాలకు గురిచేసే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
