మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన మహిళలు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.పోలీసుల వివరాల ప్రకారం, రాత్రి 10 గంటల సమయంలో జడ్చర్ల న్యూ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా 2 కిలోల 700 గ్రాముల గంజాయి లభ్యమైంది.అరెస్ట్ అయిన మహిళలు బాలానగర్ మండలం హిందుస్థాన్ కంపెనీ లో కార్మికులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓటింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం బాలానగర్, మోతీఘనపూర్, రాజాపూర్, జడ్చర్ల ప్రాంతాల్లో ఐదు గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారు చేసి రూ.300కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు జడ్చర్ల పరిధిలో ఐదు కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మొత్తం 5 కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే 2025 సంవత్సరంలో మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 21 కేసులు నమోదు చేసి 41 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 8 కిలోల 9 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.స్పెషల్ డ్రైవ్, ఈగల్ టీమ్, అవేర్‌నెస్ కార్యక్రమాల ద్వారా జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు తెలిపారు.
