మహబూబ్‌నగర్, మే 7 రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులపై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.వచ్చే నాలుగు రోజుల్లోగా పోలీసులు అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని విరాహత్ అలీ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై జిల్లా ప్రజాప్రతినిధులు నోరు విప్పాలని, లేనిపక్షంలో ఈ కేసుల్లో వారి ప్రమేయం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి కేసులను రద్దు చేయాలని, లేకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని తెలిపారు.అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని విరాహత్ అలీ తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కల్కూరి రాములు, హైమద్ పాష, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాటం నాగరాజు గౌడ్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
