• *తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్లు అనడం కరెక్ట్ కాదు*
• *ఏపీపై ప్రేముంటే పవన్ తెలంగాణలోని ఆస్తులు అమ్ముకోవాలి*
• *ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేది*
• *15 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయసులో పవన్ సీఎం అయి చేసేదేముంది*
• *ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు*
జడ్చర్ల, నవంబర్ 29: తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్లు అంటూ వ్యాఖ్యానించిన ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు. పవన్ కు ఏపీపై ప్రేమ ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్ముకొని విజయవాడకు వెళ్లిపోవాలని, అలా చేయకుండా కొత్తగా ఇక్కడ ఆస్తులు ఎందుకు కొంటున్నారని నిలదీసారు. మెగా స్టార్ చిరంజీవికి తమ్ముడు కాకపోయి ఉంటే పవన్ యాక్టర్ అయి ఉండేవారా? అని ప్రశ్నించారు. సామాన్యుడైన తాను పదేళ్లకే సీఎం అభ్యర్థి అవుతానని అంటుంటే పవన్ 15 ఏళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, 70 ఏళ్ల వయసులో ఆయన సీఎం అయి చేసేదేముందని ఎద్దేవా చేసారు.తెలంగాణ ప్రజల దిష్టి కళ్లు తలగడం కారణంగా గోదావరి ప్రాంతం ఆగమైపోయిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాము కూడా మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి సినీ హిరోలు అందరినీ అభిమానిస్తామని చెప్పారు. 2019 లో ఆంధ్రలో జరిగిన ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోతే, కనీసం పవన్ ఒక్కరైనా గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్లిఉండేవారని తాను కూడా బాధ పడ్డానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకొని గెలిచి, పదవి తెచ్చుకున్నారని, పొత్తు లేకుండా ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేదని పేర్కొన్నారు. ‘‘ మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉంటుంది, నిజంగా నీవు చిరంజీవి తమ్ముడివి కాకపోయి ఉంటే నువ్వు యాక్టర్ అయి ఉండేదా? అయినా నీకు మేము గౌరవం ఇస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ ప్రజల దిష్టి తగిలి గోదావరి ప్రాంతం ఆగమైపోయిందని పవన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. అలా మాట్లాడమే కరెక్ట్ అయితే ఏపీపై అంత ప్రేమే ఉంటే తెలంగాణలో ఉన్న ఆస్తులను అమ్ముకొని విజయవాడకు పోయి అక్కడి ప్రజలకు 24 గంటలూ సేవ చేయాలని సూచించారు. తాను పదహైదేళ్ల తర్వాత సీఎం అవుతానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తాను ఓ సామాన్యుడిగా జడ్చర్ల ప్రజల మద్దతుతో పదేళ్ల తర్వాత సీఎం అభ్యర్థి అవుతానంటుంటే పవన్ కళ్యాణ్ పదహైదేళ్ల తర్వాత సీఎం అవుతానంటున్నారని, డెబ్బై ఏళ్ల వయసులో అప్పుడు ఆయన సీఎం అయి చేసేదేముంటుందని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేసారు. పదహైదేళ్ల దాకా ఎదురు చూడటం ఎందుకని, రాబోయే ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సూచించారు. తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్లు కావని, ఆయన గెలవాలనే తాము కూడా కోరుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజలవి దిష్టి కళ్లు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసారు. ఆంధ్రలో జగన్ గెలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్లందరూ హైదరాబాద్ కు వచ్చి తలదాచుకుంటారని, టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్లు హైదరాబాద్ లో తలదాచుకుంటారని, తలదాచుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడాని హైదరాబాద్ తెలంగాణా కావాలి గానీ, తెలంగాణ ప్రజలది నరదిష్టి అని నిందిస్తారా? అని అనిరుధ్ రెడ్డి నిలదీసారు. ‘మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే హైదరాబాద్ లో ఎందుకు ఆస్తులు కొంటున్నారు, అప్పులన్నీ తీరిపోయినాయంట కదా, అని ప్రజలందరూ అంటున్నారు..’ అని పవన్ ను ఉద్దేశించి అనిరుధ్ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తెలంగాణ అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారని ప్రస్తావిస్తూ, మా ఆస్తులు కావాలి, మాకు సంబంధించినవన్నీ కావాలి కానీ మావి దిష్టి కళ్లు అంటారా అని పవన్ ను నిలదీసారు. కాగా సినిమా టిక్కెట్ ధరలు పెంచాలంటే అందులో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికులు అందరికీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేసారు, సీఎం రేవంత్ రెడ్డికి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.
